Thursday, May 22, 2008

ఫ్యాక్ష-నిజం

కర్నూలు జిల్లాలో కొన్నేళ్ల నిద్రావస్థ తర్వాత మళ్లీ పడగ విప్పిన ఫ్యాక్షన్ భూతం గతవారం స్థానిక కప్పట్రాళ్ల గ్రామ తెలుగుదేశం నేత పాలెగారు వెంకటప్పనాయుడుతో సహా తొమ్మిదిమందిని బలితీసుకుంది. దీనిపై స్పందిస్తూ తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పటిమాదిరిగానే వైఎస్ పై, ఆయన ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఇది ఫ్యాక్షన్ ప్రభుత్వమని, ఈ ముఖ్యమంత్రి హయాంలో తమ పార్టీ కార్యకర్తలెవరి ప్రాణాలకూ భరోసా లేదనీ, .. ఇలా మనం ఎన్నో సార్లు వినున్న వాక్యాలే మళ్లీ వల్లె వేశారు. అయితే, హతుల నేపధ్యం తెలిసినవాళ్లకు చంద్రబాబు మాటలు గురివింద చందంగా అనిపిస్తే అది వాళ్ల తప్పుకాదు.
కాంగ్రెసు అధికారంలోకొచ్చాక రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల ఆగడాలు పెరిగిపోయిన మాట నిజమే. అయితే, ఫ్యాక్షనిజం మహమ్మారిని ప్రోత్సహించటంలో తెలుగుదేశం కూడా తక్కువేమీ తినలేదు. రాజకీయావసరాల కోసం వైరివర్గాలను చేరదీసి రాయలసీమలో రక్తపుటేర్లు పారిస్తున్న తిలాపాపం కాంగ్రెసు, తెలుగుదేశాలకు తలా పిడికెడు. కత్తితో చంపేవాడు కత్తితోనే మరణిస్తాడన్న బైబిలు వాక్యం సాక్షిగా ముఠా తగాదాలతో మమేకమైపోయిన జీవితాలు అలాగే ముగిసిపోతాయి. చేసుకున్న వారికి చేసుకున్నంత. ముప్పై ఎనిమిదేళ్లుగా ఫ్యాక్షన్ తో పెనవేసుకున్న వెంకటప్పనాయుడి బ్రతుకూ అలాగే తెల్లారిపోయింది. నిజమిలా ఉంటే, హతుల గత చరిత్ర తెలియనట్లు చంద్రబాబు అమాయకత్వం ఒలకబోయటం విడ్డూరం.
‘ఫ్యాక్షన్ అనేది ఫాషన్ కాదు. ఒక సారి ఈ ఊబిలో కూరుకున్నారంటే బయటకు రాలేరు. నా కధ విన్నాకైనా దీనికి దూరంగా ఉండండి’ అని నాలుగేళ్లనాటి ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పిన వెంకటప్పనాయుడి మాటల వెనుక ఒక నిస్సహాయుడి ఆవేదన కనిపిస్తుంది. అతని ప్రత్యర్ధులని కదిలించినా దాదాపు ఇవే మాటలు చెబుతారేమో. ఇరు వర్గాలూ విసుగెత్తిపోయి ఉన్నా ఇంకా ఫ్యాక్షన్ బ్రతికే ఉండటానికి కారణం నిస్సందేహంగా రాజకీయ పార్టీల చదరంగమే. ఫ్యాక్షన్ గురించి చంద్రబాబు, వైఎస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం ఆపి దీన్ని అరికట్టటానికి కలిసి కృషి చెయ్యాలి. ఫ్యాక్షనిస్టులకు తమ పార్టీలలో చోటు ఇవ్వమని ప్రకటనలతో సరిపెట్టటం కాకుండా దాన్ని చేతల్లో చూపించాలి. పోలీసులకు ఈ విషయంలో పూర్తి అధికారాలిచ్చి వారిపై రాజకీయ ఒత్తిడి లేకుండా చూడాలి. ఫ్యాక్షన్ నుండి రాజకీయాన్ని విడదీసిన నాడు ఎందుకు లొంగదీ పెనుభూతం?
ఫ్యాక్షనిజాన్ని పౌరుషానికి చిహ్నంగా చూపుతూ తొడలుగొట్టి మెడలు నరికే సినిమాలు పదులకొద్దీ తీస్తున్న తెలుగు చిత్రపరిశ్రమ కూడా ఈ విషయమై పునరాలోచించుకోవాలి. ఇన్నాళ్లూ ఫ్యాక్షన్ పేరిట సొమ్ముచేసుకున్న నిర్మాతలు కాస్తంత సామాజిక బాధ్యత వహించి అదే ఫ్యాక్షనిజాన్ని ఎండగడుతూ సందేశాత్మక చిత్రాలెందుకు తీయకూడదు? సొంత లాభం కొంత మానుకుని సినీ మాధ్యమానికున్న శక్తిని సమాజ హితంకోసం ఎందుకు వాడకూడదు?

రాజకీయ చిత్రం

చిరంజీవి రాజకీయ ప్రవేశం ఖాయమైన నేపధ్యంలో తెలుగుదేశానికి మరింత సినీ గ్లామర్ అద్దే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. ఎన్టీయార్ వారసులందరూ తెదెపా వెనుకే ఉన్నారన్న సంకేతాలు జనంలోకి పంపే లక్ష్యంతో బాలకృష్ణ తదితర కధానాయకులని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావటం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివల్ల ఉపయోగం ఎంతుందో తెలీదు. బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చినా, రాకపోయినా ఆయనే పార్టీకి మద్దతిస్తాడో ఎవరికి తెలియదు? ఇప్పుడు ఆయన తెదెపాలో ప్రధాన పాత్ర పోషించినంతమాత్రాన ఆ పార్టీ అదృష్టం రాత్రికి రాత్రి మారిపోతుందనేది అనుమానమే.
మరో వంక, చిరంజీవి పార్టీ వల్ల ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత నష్టం కలగనుందో తెలీని అయోమయ పరిస్థితి. ఒకటి మాత్రం నిజం. 1983లో ఎన్టీయార్ లా ఇప్పుడు చిరంజీవి ప్రభంజనం సృష్టించే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. కానీ ఆయన కోస్తా, రాయలసీమల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రధాన పక్షాల ఓటు బ్యాంకులకు గండికొట్టవచ్చు. కులాలవారీ ఓట్ల ప్రాతిపదికన చూస్తే ఈ నష్టం కాంగ్రెసుకే ఎక్కువుంటుందని కొందరి అంచనా. తెలంగాణలో పరిస్థితిపై ఈ నెలాఖరున జరగబోయే ఉప ఎన్నికల ఫలితాలొచ్చేదాకా ఏమీ చెప్పలేం. కెసియార్ ఎంత కష్టపడినా తెరాస ఎన్నో కొన్ని సీట్లు కోల్పోక తప్పేలా లేదు. అదే జరిగితే తెలంగాణ సెంటిమెంటుపై నీళ్లుజల్లేలా ఆయన ప్రత్యర్ధుల రాజకీయాలు నడవటం తధ్యం. అయితే, కెసియార్ పనయిపోయిందనుకున్నపుడల్లా ఆయన ఒక కొత్త ఎత్తుగడతో తిరిగి రావటం ఇప్పటికే చాలాసార్లు చూసి ఉన్నాం కాబట్టి, ఉప ఎన్నికల ఫలితాలెంత నిరాశాజనకంగా ఉన్నా కెసియార్ ఏదో ఒక టక్కుటమార ప్రదర్శన చేసి వచ్చే సాధారణ ఎన్నికలనాటికి కూడా తెలంగాణలో ఒక నిర్ణయాత్మక శక్తిగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
కమ్యూనిస్టుల వైఖరెలా ఉండబోతుందో కొంత స్పష్టంగానే ఉంది. 2009 నాటికి సి.పి.ఎం. తెదెపాతో జట్టుకట్టే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. సి.పి.ఐ. ప్రస్తుతానికి వేచిచూచే ధోరణిలో ఉన్నా, ఎన్నికలనాటికి తన సహచర కామ్రేడ్స్ తోనే కలసి నడవొచ్చు. బి.జె.పి.ది ఒక వింత పరిస్థితి. 1999 నుండి 2004 మధ్యకాలంలో తప్ప, రాష్ట్రంలో ఆ పార్టీ ఎప్పుడూ అంటరాని పక్షమే. వచ్చేసారి కూడా ఎన్నికల్లో వాళ్ల ప్రాబల్యం కనిపించే సూచనలు లేవు. ఆదర్శాలు బాగున్నా ఎన్నికల సమరాంగణంలో లోక్ సత్తా సత్తా ఎంతో ఇంకా తెలియదు కాబట్టి వాళ్లతో పొత్తులకు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపించకపోవచ్చు.
తెలుగుదేశం - చిరంజీవి పార్టీల నాయకత్వంలో ఒక ఉమ్మడి ప్రతిపక్ష వేదికకై కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేయవచ్చనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాళ్లు చిరంజీవి సన్నిహిత బృందంలో ఎక్కువమంది ఉండటం కూడా ఈ ఊహకి ఆధారం కావచ్చు. బి.వి.రాఘవులు ఈ మధ్య చేసిన వ్యాఖలు దీన్ని బలపరిచే విధంగానే ఉన్నాయి. సినీ రంగంలో ప్రత్యర్ధులుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ రాజకీయాల్లో చేతులు కలిపితే పెద్ద విశేషమే. మీడియా మొగల్ రామోజీరావు కూడా తెరవెనుక ఇవే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని పుకార్లు. ఇటీవల చిరంజీవిని వ్యక్తిగతంగా ఇబ్బందుల పాల్జేసిన పలు సంఘటనల వెనుక కాంగ్రెసు నాయకుల ప్రమేయం ఉన్నదనీ, అందువల్ల, ఆయన ఎవరో ఒకరి వైపు మొగ్గుచూపే పరిస్థితే వస్తే అది తెదేపా వైపే అవుతుందనీ మరికొందరి వాదన. మొత్తమ్మీద వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో సినీ తారల హంగామా ముందెన్నడూ లేనంత ఎక్కువగా ఉండొచ్చు.
చిరంజీవి ఎవరితో జట్టు కడతాడు అనే విషయంలో పుకార్లు, అంచనాలు ఎలా ఉన్నా, ఆయన కాంగ్రెసు పార్టీతో కలవడని మాత్రం తేలికగానే చెప్పవచ్చు. కాంగ్రెసుని తిరిగి అధికారంలో ఉంచటానికి ఆయన సినిమాలు మానుకుని రాజకీయాల్లోకి రాడు కదా. అలాగే చంద్రబాబునో, బాలకృష్ణనో ఉద్దరించటానికి కూడా చిరంజీవి రాజకీయాల్లోకి రాడు. వ్యక్తిగతంగా ఎంత కాంగ్రెసు వ్యతిరేకత ఉన్నా ఎన్నికలకు ముందే తెదెపాతో చిరంజీవి పొత్తు పెట్టుకోకపోవచ్చు. పైగా, ఎన్నికలకు ముందే తెదెపాతో చెలిమి చేస్తే తన సామాజిక వర్గం ఓట్లుకూడా గణనీయమైన సంఖ్యలో ఆయనకు పడకుండా పోయే ప్రమాదం ఉంది - దీనికి కారణం ఎక్కువమంది కాపులు మొదటినుండీ తెదెపాకి వ్యతిరేకంగా ఉండటం. కాబట్టి చిరంజీవి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెసేతర కూటమితో చేతులు కలపొచ్చు. అదే జరిగితే (తెరాస - కాంగ్రెసుల ఏడాదిన్నర కాపురాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఉంటే) రాష్ట్రంలో మొదటి సంకీర్ణం అధికారంలోకొచ్చినట్లే. ఎందుకంటే, గెలుపుపై వైఎస్సార్ ఎంత ధీమాగా ఉన్నా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే 2004లో చంద్రబాబుకి లాగానే చేదు ఫలితాలు ఎదురవక తప్పదు. దీనికి విరుగుడు, తిరిగి ఎవరో ఒకరితో చెయ్యి కలపడం. తెదెపా, చిరంజీవి, బిజెపి, కమ్యూనిస్టులని తీసేస్తే ఇక మిగిలింది తెరాస. తప్పకుండా తెలంగాణ ఇస్తామంటే తెరాస అందుకు ఒప్పుకోవచ్చు. కానీ, ఒక సారి అనుభవమయ్యాక కాంగ్రెస్ మాటని కెసియార్ మళ్లీ నమ్మినా తెలంగాణ ప్రజలు నమ్ముతారా?

మరో పునరంకితం

నాలుగేళ్లుగా ఏడాదికోసారి ఆర్భాటంగా పునరంకిత సభ పేరుతో జరుపుతున్న జాతర ఈ మారు కూడా వందిమాగధగణం సమక్షంలో కమనీయంగా జరిపుకున్నారు ముఖ్యమంత్రివర్యులు. ఈ సభలో యధాప్రకారం పరనిందతో పాటు ఆత్మస్థుతి కూడా కావలసినంత చేసుకున్నారు. నాలుగేళ్ల పాలనలో స్వపరివారంపై తాము జరిపించినన్ని విచారణలు దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ జరిపించలేదని చెప్పుకుని మురిసిపోయారు. ఇదొక రికార్డని ఆయన ఉద్దేశ్యమేమో. అయితే, ఒక ముఖ్యమంత్రిపై, ఆయన పరివారంపై ఇన్ని ఆరోపణలు రావటం కూడా ఒక రికార్డేనని ఆయనకి తెలియకపోవటం వింతే. ఆయా విచారణల్లో ఎన్ని పూర్తయ్యాయి, వాటిలో ఏమి తేల్చారు లాంటి విషయాలు మాత్రం ఆయనెంత తెలివిగా దాటవేసినా జనాల దృష్టిలోంచి తప్పుకుపోవు.
1999 ఎన్నికల అనంతరం చంద్రబాబు తనకి మంత్రి పదవి కాకుండా ఉపసభాపతి పదవి ఇచ్చినందుకు అలిగి కెసియార్ తెరాస పార్టీ పెట్టాడని వైఎస్సార్ కి ఈ మధ్యనే తెలిసింది. నాలుగవ పునరంకిత సభలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించటమే కాకుండా ‘ఇది నిజమా కాదా’ అంటూ కెసియార్ ని నిలదీశారు. ఆ విషయం నాలుగేళ్ల క్రితమే తెలిసుంటే 2004 ఎన్నికలప్పుడు తెరాసతో సర్దుబాటు చేసుకునేవాళ్లు కాదేమో! ‘తెలంగాణా ఏమన్నా మీ ఒక్కరి సొత్తా?’ అని కెసియార్ ని ఒకవంక నిలదీస్తూనే మరోవంక ‘ఈ సమస్యకి పరిష్కారం చూపగలిగేది కాంగ్రెస్ ఒక్కటే’ అని ముక్తాయించటం ద్వారా తెలంగాణా కాంగ్రెసు పార్టీకి మాత్రమే గుత్త సొత్తు అని చెప్పకనే చెప్పారు. కమిటీలపై కమిటీలేయటం, అందరి అభిప్రాయాలూ తీసుకుని తమ అభిప్రాయం మాత్రం చెప్పకపోవటం, రోజుకో రకంగా మాట్లాడటం .. ఇలాంటి వాటితో తెలంగాణా సమస్య పరిష్కారమవుతుందనేది ఆయన ప్రగాఢ నమ్మకం కావచ్చు.
వైఎస్సార్ కి ఈ మధ్య కలిగిన మరో కనువిప్పు కమ్యూనిస్టుల గురించి. ఇన్నాళ్లూ సి.పి.ఎం. సిద్ధాంతాలున్న పార్టీ అని ఆయన అనుకునే వాడట. తమని కాదని ఉప ఎన్నికల్లో తెదెపాతో జట్టు కట్టేసరికి ఆ పార్టీ సిద్ధాంతాలు గాలికెగిరిపోయానని ఈయన ఆవేదన చెందటం మొదలెట్టాడు. పదిహేనేళ్ల పాటు తెదేపాతో అంటకాగి 2004లో కాంగ్రెసుతో కలిసి నడిచినప్పుడు కమ్యూనిస్టుల సిద్ధాంతాలకు ఢోకారాలేదేమో మరి. ‘కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదొద్దు’ అని చంద్రబాబు నుద్దేశించి బి.వి.రాఘవులుకి సభాముఖంగా సలహా ఇచ్చారు. ‘మరి నాలుగేళ్ల క్రితం మీ తోక పట్టుకుని ఈదాం కదా. మీరూ కుక్కేనా, లేక మరేదన్నా జంతువా?’ అని రాఘవులు గారు ధర్మ సందేహం వ్యక్తం చేశారు కానీ దానికి సమాధానమిచ్చేంత తీరికా, ఓపికా వైఎస్ కేవీ?
ఇదే సభలో, ఏడాదిలో రాబోయే సాధారణ ఎన్నికలకోసం ఇప్పటినుండే జనంలోకెళ్లి నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని వాళ్లకు వివరించాలని కాంగ్రెసు కార్యకర్తలను ఆదేశించారు వైఎస్. అవినీతి వరదలో కొట్టుకుపోతున్న జలయజ్ఞం, సెజ్ ల పేరిట బక్కరైతుల పొట్టకొట్టి అస్మదీయులకు చేస్తున్న భూసంతర్పణ, రాష్ట్రమంతటా రకరకాల పార్కుల పేరుతో సాగుతున్న రియల్ ఎస్టేట్ దందా, రాజధానిలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల వేలం, దేవుడి పాలనలోనూ ఆగని రైతుల ఆత్మహత్యలు, రాయలసీమలో పెచ్చరిల్లిన ఫ్యాక్షన్ హత్యలు, వెగటు పుట్టించే రాజీవ నామ జపం, నాలుగేళ్లయినా పాలనపై పట్టు చిక్కలేదని వస్తున్న విమర్శలు, ఎంతటికైనా తెగించి స్వజనానికి లాభం చేకూర్చటం, కొన్ని వర్గాలను పనిగట్టుకుని సాధించటం, అవినీతిపై ఎవరేమి ప్రశ్నించినా తెగబడి ఎదురుదాడి చెయ్యటం .. ఇవా అభివృద్ధి సూచికలు? అభివృద్ధి ఉంటే ప్రచారంతో పనిలేకుండానే జనాలకర్ధమవుతుంది. ఇప్పటికైనా తీరు మారకుంటే 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టిన గతే వచ్చేసారి వైఎస్ కూ పట్టటం తధ్యం

అన్నిటికీ రాజకీయమేనా, అద్వానీజీ?

జైపూర్ లో మొన్న జరిగిన బాంబు పేలుళ్లపై స్పందిస్తూ బి.జె.పి. అగ్రనేత ఎల్.కె.అద్వానీ అలవాటు ప్రకారం యు.పి.ఎ. ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి సందర్భాన్నీ అవతలి పక్షాన్ని దుయ్యబట్టటానికే వాడుకోవాలనిచూసే నాయకులు దొరకటం భరతజాతి ఎన్నడో చేసుకున్న పాప ఫలితమేమో. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా యు.పి.ఎ. అధికారంలోకి రాగానే తీవ్రవాదుల పీచమణచటానికుద్దేశించిన ‘పోటా’ చట్టాన్ని రద్దు చేసిందట, దాని ఫలితంగానే దేశంలో తీవ్రవాద దాడులు పెరిగిపోతున్నాయట. తమ ఎన్.డి.ఎ. హయాంలోనే, పోటా అమల్లో ఉండగానే, అందునా ‘లోహ పురుష్’ అద్వానీజీ పోలీసు శాఖ మంత్రిత్వం నెరపుతున్నప్పుడే పార్లమెంటుపై తీవ్రవాద దాడి జరిగిన సంగతి ఆయనకీ సందర్భంలో గుర్తుకురాకపోవటం గమ్మత్తే. అవసరానికనుగుణంగా కొన్ని నిజాలను నాయకమ్మన్యులెంత అనువుగా మర్చిపోయినా జనాలకవి బాగానే గుర్తుంటాయి.
మతం ప్రాతిపదికన ఓటు బ్యాంకు రాజకీయాలు నడపటమనే కళని దేశవ్యాప్తం చేసిన అద్వానీ ఆ పేరిట వేరే వాళ్లని విమర్శించటం మరో గమ్మత్తు. మైనారిటీలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థుల మెదళ్లు కలుషితం చేసే పనిలో ఇరవయ్యేళ్లుగా అలుపెరగక శ్రమిస్తున్న యోధుడాయన. ఓటు బ్యాంకు రాజకీయాలు ఆయనకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు?
జైపూర్ సంఘటనకి సంబంధించి అతి పెద్ద వైఫల్యం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానిదే. శాంతి భద్రతలకు సంబంధించినంతవరకూ కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు రాష్ట్రాన్ని అప్రమత్తం చేయటం మినహా మరేమీ చెయ్యలేవని అద్వానీజీకి తెలియనిదా? ఎంత తమ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ విషయంలో రాజస్థాన్ ప్రభుత్వాన్ని అద్వానీజీ వెనకేసుకురావటమేంటి?
నాలుగేళ్ల యు.పి.ఎ. హయాంలో ఎన్ని తీవ్రవాద దాడులు జరిగినా ఒకరికీ శిక్ష పడలేదని ఆయన వాపోయారు. నిజమే కావచ్చు. ఏడేళ్ల ఎన్.డి.ఎ. పాలనలో ఎందరికి పడ్డాయి శిక్షలు? గ్రాహం స్టెయిన్స్ హంతకుడు దారా సింగ్ కే శిక్ష పడింది? వందలాది మందిని బలిగొన్న గుజరాత్ నరమేధానికి కారకులు కళ్లెదుటే దర్జాగా తిరుగుతున్నా, దాని తెరవెనుక సూత్రధారులు సొంత పార్టీలో మహానేతలుగా ఎదుగుతున్నా అడ్డుకోలేని ఈయన ఎదిరి పక్షానికి వంకలు పెట్టటం విడ్డూరం. అద్వానీ స్థాయి నేతలు ప్రతి సంఘటననీ రాజకీయ లబ్దికే వాడుకోవటం తగదు.

ఇందిరా ప్రదేశ్!

ఐదేళ్లుగా స్వదేశమెళ్లకుండా అమెరికాలోనే దాక్కున్న నా హైదరాబాదీ మితృడిని కారణమేంటని ఆరా తీస్తే ‘హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగ్గానే నా పేరుని రాజీవ్ గా మార్చేస్తారేమోనని భయంగా ఉందిరా. అందుకే ..’ అన్నాడు దిగులుగా. వాడి అసలు పేరు అంత గొప్పగా ఏమీ ఉండదు, కానీ ఎవరి పేరుపై వాళ్లకి మమకారమే కదా. అసలు విషయానికొస్తే ..
‘ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా’ అని పార్లమెంటులో ఎలుగెత్తి చాటిన పాతతరం కాంగిరేసు కేతిగాళ్ల గురించి కేవలం వినున్నాం. ఇప్పుడు వాళ్ల తలదన్నే భజన సామ్రాట్టులని మన రాష్ట్రంలోనే ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రకటించిన పధకాలు ఎంత నత్తనడకలు నడుస్తున్నా, ప్రతిదానికీ రాజీవుడిదో లేక ఇందిరమ్మదో పేరు తగిలించే కార్యక్రమం మాత్రం శరవేగంగా అమలవుతోంది. తాము అధికారంలోకొస్తే ఇలా అన్నిటికీ వాళ్లిద్దరి పేర్లు తగిలిస్తామని పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ వాగ్దానమేమన్నా చేశాడేమో మరి. ఒక లెక్క ప్రకారం ఇప్పటికే దాదాపు పాతిక ప్రభుత్వ పధకాలకు, నిర్మాణాలకు ఈ రెండు పేర్లు తగిలించేశారు. కె.పి.హెచ్.బి. కి కూడా ఆ పని చెయ్యబోతే అక్కడి జనాలడ్డుపడటంతో ఎలాగో ఆగిపోయింది. ఉప్పల్ లో హెచ్.సి.ఎ. వాళ్లు కోట్లు పోసి కట్టించుకున్న క్రికెట్ స్టేడియానిక్కూడా రాజీవ్ పేరు తగిలించాలని ముఖ్యమంత్రి ముచ్చటపడితే స్టేడియం నిర్మాణానికయిన ఖర్చు స్పాన్సర్ చేసిన సంస్థ ఒప్పుకోలేదు. అప్పుడు ఆ ఖర్చు (5 కోట్లట) ప్రభుత్వ పద్దులోంచి విశాకా అనబడే సదరు సంస్థకి రాసిచ్చి మొత్తమ్మీద ముఖ్యమంత్రిగారి ముద్దు తీర్చారు సర్కారువారు - ఇది రెండేళ్ల క్రితం సంగతి. సోనియామ్మ దయాదాక్షిణ్యాలకోసం ఐదు కోట్ల రూపాయల జనం సొమ్ము తగలేసి ఒక క్రీడాంగణానికి రాజీవుడి పేరు కొని పెట్టారన్నమాట!
ఈ క్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిణి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి అసలు రాష్ట్రం పేరే ఇందిరమ్మ రాష్త్రంగా మారిస్తే పోతుందన్న మహత్తరమైన ఆలోచనొచ్చింది. పధకానికోసారి పేరు పెట్టటం, ఉన్న వాటికి పేర్లు మార్చటం వృధా ప్రయాస అనుకున్నారేమో మరి, ఏకంగా టోకున రాష్ట్రానికే పేరుమార్చేస్తే బావుంటుందనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం, నిన్న గుంటూరులో ఆ సంగతి కడు తన్మయం చెందుతూ ప్రకటించేశారు. పైగా, ‘ప్రజలు కోరితే చేస్తాం’ అంటూ ఈ బృహత్పధకంలో అడగకున్నా ప్రజలకూ భాగస్వామ్యం కల్పించారు మంత్రివర్యులు. ఆ మాటలో ’మేం చేస్తే మీరు కోరినట్లే’ అన్న నిగూఢార్ధమేమన్నా దాగుందేమో తెలీదు. దీని తర్వాత రాష్ట్రంలో మగవాళ్లందరి పేరు ముందరా ‘రాజీవ్’, ఆడవాళ్లందరి పేరు ముందరా ‘ఇందిర’ అని తప్పనిసరిగా చేర్చాలని శాసనం కూడా చేస్తారు కాబోలు.
అసలు, అంత స్వామి భక్తి పరాయణులైతే తమ పిల్లలకో మనవలకో ఇందిరా రాజీవుల పేర్లు పెట్టుకుని తరించొచ్చుగదా. రాజశేఖరరెడ్డి గారిని రాజీవ్ శేఖర రెడ్డిగా మారిపొమ్మనండి. ఎవరొద్దంటారు? వాళ్ల ఇష్టాయిష్టాలను రాష్ట్రం నెత్తిన రుద్దటమేంటి? ప్రతిదానికీ కాంగ్రెస్ నేతల పేర్లే పెట్టదలచుకుంటే పి.వి., జలగం, కాసు, కోట్ల, చెన్నా లాంటి ఎందరు నాయకులు లేరు? మరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనూ చూడమీ చోద్యం. జనాలకు విసుగొచ్చేదాకా ఈ భజన వ్యవహారాలు సాగదీస్తే ఏలినవారికెప్పుడో ఎదురుదెబ్బ తగలడం ఖాయం.

Monday, May 12, 2008

ఎందుకీ కస్సు బుష్షు?

పోయిన వారమంతా భారతావనిలో ఎక్కడచూసినా అమెరికా అధ్యక్షులవారిపై ఆగ్రహజ్వాలలే! 'ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగటానికి ఈమధ్య భారతీయులు ఎక్కువగా తినడమే కారణం' అని బుష్ దొరవారు అన్నారట. అందుకని జాతీయస్థాయి నాయకుల నుండి సగటు పౌరుల వరకు అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆయన్ని ఉతికి ఆరేశారు. కాలమిస్టులు విజృంభించి పత్రికల్లో పుంఖానుపుంఖానులుగా వ్యాసాలు రాసిపారేశారు. కార్టూనిస్టులక్కూడా చేతినిండా పని దొరికింది. బి.జె.పి. వాళ్లయితే బుష్ తో పాటు పన్లో పనిగా మన్మోహన్ సింగ్ నీ, సోనియానీ, యు.పి.ఏ. ప్రభుత్వాన్నీ కూడా ఆడిపోసుకున్నారు. కొంతమంది మరీ ముందుకెళ్లి దీన్ని దేశ భక్తితో ముడిపెట్టి బుష్ ని ఈ విషయంలో వెనకేసుకొచ్చేవాళ్లు దేశ ద్రోహులన్నట్లు తీర్మానించేశారు.

ఇంతకీ, వీళ్లలో ఎందరు నిజంగా జార్జ్ బుష్ అన్న మాటలు విన్నారు లేదా చదివారు? బుష్ ఏ సందర్భంలో ఆ మాటలన్నాడు, అసలేమన్నాడు, ఏ ఉద్దేశ్యంతో అన్నాడు లాంటి విషయాలు ఎవరికన్నా పట్టాయా? సందర్భాన్ని తీసేసి చూస్తే రామా అన్నా బూతులాగానే వినిపించొచ్చు.

ఇంత దుమారానికి కారణమైన, అమెరికా ఆర్ధిక స్థితిగతులపై మిస్సోరీలో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ జార్జ్ బుష్ చేసిన వ్యాఖ్యలకు యధాతధ అనువాదమిది:

'ధరలు పెరగటానికి ఎన్నో కారణాలుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం కూడా అందులో ఒకటి. అది మంచిదే. దీనివల్ల వాణిజ్యం పెరుగుతుంది. మరో రకంగా చెప్పాలంటే, ప్రపంచం ఎంత సంపన్నమయితే అంతగా వాణిజ్యావకాశాలు పెరుగుతాయి. అయితే, జీవన ప్రమాణాలు పెరిగేకొద్దీ ప్రజల అవసరాలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకి, భారతదేశంలో 35 కోట్లమంది మధ్య తరగతి ప్రజలున్నారు. వీళ్ల సంఖ్య అమెరికా జనాభా మొత్తం కన్నా ఎక్కువ. వీళ్ల జీవన ప్రమాణాలు పెరిగే కొద్దీ పౌష్టికాహారం కోసం డిమాండ్ పెరుగుతుంది. దానితో సరుకు లభ్యత తక్కువై ధరలు పెరుగుతాయి'.

'అయితే, అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగటానికి కారణం సరుకుల కొరత కాదు. దానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు ఎక్కువగా ఉండటం. ఇంధనం ధరలు పెరిగితే సహజంగానే అది మిగతా అన్ని వస్తువులపై పడుతుంది. మనకి సరుకుల లభ్యత లేకపోవటమనే సమస్య లేదు. ఉన్న సమస్యల్లా, వాటి ధరలు ఎక్కువగా ఉండటం'.

ఇందులో భారతీయులని అవమానించటానికేముంది? 'భారతీయ మధ్యతరగతి జీవన స్థాయి పెరగటం మంచిదే' అన్న వ్యాఖ్యని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. బుష్ చెప్పిందేమీ ఆయన సొంత తెలివితేటలతో పరిశోధించి కనుక్కున్నది కూడా కాదు. ఆర్ధికవేత్తలందరూ అనేమాటే అది. అసలాపాటి విషయం చెప్పటానికి ఆర్ధికవేత్తల అవసరం కూడా లేదు.

అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చెయ్యటానికి కొద్ది రోజుల ముందు ఆ దేశ విదేశాంగ మంత్రి కొండలిజా రైస్ కూడా దాదాపు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. ఆమె మనతో పాటు చైనా పేరు కూడా ప్రస్తావించింది. చైనా ఈ విషయం పట్టించుకోకుండా వదిలేస్తే మనవాళ్లు మాత్రం నానా యాగీ చేసి బుష్ మాటలకి అనవసరమైన అంతర్జాతీయ ప్రాచుర్యం తెచ్చిపెట్టారు.

ఇదే ముఖాముఖిలో పేద దేశాలపై అమెరికా ఔదార్యంపై, అమెరికన్ల దయా గుణంపై బుష్ మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు. మనకవి నచ్చకపోవచ్చుకానీ, సందర్భమొస్తే మనగురించి గొప్పలు చెప్పుకోవటానికి మనమూ ముందుండమా?

Tuesday, May 6, 2008

మారెప్పోపాఖ్యానం

కాంగ్రెసు పార్టీలో విదూషకులకేనాడూ కొరతలేదు. సీనియర్ కమెడియన్ 'ఫ్లాష్ బ్యాక్' సత్తెన్నగారు వయోభారం వల్లనో, తన కామెడీని ఎవరూ పట్టించుకోవటంలేదని అలగటంవల్లనో, మరే చెప్పలేని కారణంవల్లనో, మొత్తానికి మంత్రిపదవికి రాజీనామా చేసిపారేశాక పత్తాలేకుండా పోయారు. రేలంగి పోయాక రాజబాబు, ఆయనా పోయాక బ్రహ్మానందం వచ్చినట్లు - సత్తెన్నగారి వారసులకోసం ఆంధ్ర ప్రజానీకం ఎక్కువగా ఎదురుచూసే అవసరం లేకుండా నేనున్నానంటూ దూసుకొచ్చారు మార్కెటింగ్ శాఖామాత్యులు మారెప్పగారు. రాష్ట్రంలో దేవుడి పాలన చల్లగా సాగుతుండటంతో వీరు వీధులెంటబడి పెద్దగా సరుకులు మార్కెటింగ్ చెయ్యాల్సిన అవసరం లేకుండాపోయింది. దాంతో తెలుగు ప్రజలకు రోజూ వినోదాన్నందించే బాధ్యత మారెప్పగారు నెత్తినేసుకున్నారు. స్వతహాగా ఈయనకు దైవ భక్తి మెండు. తన దేవుడినెవరేమన్నా వెంటనే పత్రికా సమావేశం పెట్టి ఆ అన్నవాళ్లని చెడామడా కడిగిపారేస్తారు. ఐతే, పేరడీ సినిమాల్లో ఫ్యాక్షనిస్టులా వీరి ఆగ్రహం జనాలకు నవ్వులాటగా ఉంటుందని పాపం ఈయనకు తెలియదు.

కొన్నాళ్ల విరామం తర్వాత ఈమధ్య మంత్రి మారెప్పగారి దృష్టి చంద్రబాబుమీద పడింది. ఏమయిందో ఏమో కానీ ఉన్నట్లుండి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి 'బాబుది ఐరన్ లెగ్' అంటూ తను కొత్తగా కనుగొన్న విశ్వ రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఇన్నాళ్లూ మారెప్పగారు విశ్వరహస్యాల్ని ఛేదించే పనిలో నిమగ్నమయ్యున్నారని అప్పుడర్ధమయింది విలేకర్ల సమూహానికి. ఇంతకీ చంద్రబాబుది ఐరన్ లెగ్ అని మారెప్పగారు నిర్ధారించటానికి కీలకాధారాలు రెండు - అంటే, 'న్యూటన్ గమన సూత్రాలు మూడు' అన్నట్లుగానన్నమాట. అవి:

1. మీకోసం యాత్రలో భాగంగా బాబు తిరుపతిలో పర్యటించి వెళ్లిపోగానే శ్రీవారి గొడుగులు కాలిపోయాయి.
2. ఆతర్వాత బాబు గుంటూరు జిల్లాలో పర్యటించి వెళ్లగానే అక్కడ మిర్చి యార్డు తగలబడిపోయింది.

తను కనుగొన్న బ్రహ్మాండమైన విషయాన్ని అందరికీ తెలియజెప్పే ఆతృతలో మారెప్పగారు తొందరపడి నోరుజారారేగానీ, ఈ సంగతి చంద్రబాబు చెవినబడితే కలిగే విపరిమాణాలు ఆయన ఊహించలేకపోయారు. 'అర్రెర్రె.. నా కాలుకి అంత పవర్ ఉందా! ఈ ఎండల్లో చెమటలు కక్కుకుంటూ బస్సు యాత్ర చేసేబదులు పులివెందుల వెళ్లి వై.ఎస్. ఇంట్లో ఓ సారి కాలు పెట్టొస్తే పోతుంది కదా' అని బాబు అనుకుంటే ముఖ్యమంత్రి కొంపలంటుకుపోవూ?

విశ్వరహస్యాల్నివిడగొట్టే క్రమంలో రోజులతరబడి టెలిస్కోపుతో గ్రహాలనీ, నక్షత్రాలనీ పరీక్షించీ, చించీ, మారెప్పగారికి కాస్తంత జ్యోతిష్యం కూడా వద్దన్నా వంటబట్టేసింది. దాంతో తన జ్యోతిష్య ప్రావీణ్యాన్నికూడా పన్లో పనిగా చంద్రబాబు మీదనే ప్రయోగించారు. 'జూన్ 12 తర్వాత చంద్రబాబు ఔట్' అని అదే విలేకర్ల సమావేశంలో ఎలుగెత్తి చాటారు. ఈ నెలాఖరు తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 12 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు గెలుచుకోవటం ఖాయమట. ఆ దెబ్బకి బాబు పార్టీ మట్టిలో కలవటం తధ్యమట! మరి మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం ఎవరు గెలుస్తారో విలేకర్లడగలేదు, ఆయన చెప్పలేదు.

ఈ సంగతి ఖమ్మం జిల్లాలో మనకోసం యాత్ర చేస్తున్న చంద్రబాబు చెవిలో ఎవరో ఊదారు. 'అవన్నీ తెరాస సిట్టింగ్ స్థానాలు కదా. వాటిని కాంగ్రెస్ గెలుచుకుంటే కెసియార్ కదా ఔట్ కావలసింది, మరి నేను ఔట్ అంటాడేమిటి మారెప్ప? ఇందులో ఏమన్నా మతలబుందా? ఇంతకీ ఇది క్లీన్ బౌల్డ్ కిందకొస్తుందా లేక రన్నౌటా? రన్నౌటైతే ఫర్వాలేదుగానీ క్లీన్ బౌల్డంటే ఇబ్బందే. ఇప్పటికే నా బ్యాటింగ్ టాలెంట్ మీద మా టీం మెంబర్లకి అనుమానాలొస్తున్నాయి. వైస్ కెప్టెన్ దేవేందర్ ఎప్పుడు వెళ్లిపోయి సొంత టీం పెట్టుకుందామా అని చూస్తున్నాడు. నా టెన్షన్ లో నేనుంటే మధ్యలో ఈ మారెప్ప జోస్యాలొకటి. ఎందుకన్నా మంచిది, ఎవరన్నా స్పెషలిస్టు జ్యోతిష్యుడిని సంప్రదించాలి' అనుకుంటూ మాసిన గెడ్డం బరుకుతూ దీర్ఘాలోచనలో పడిపోయాడు బాబు.

Friday, May 2, 2008

వార్తా పత్రిక నిత్యావసర వస్తువా!

రాష్ట్రంలో మీడియా యుద్ధం తారాస్థాయిలో ఉంది. ప్రధాన వార్తా పత్రికలయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక వంక, ఈ మధ్యనే వచ్చిన సాక్షి మరో వంక మొహరించి ఒకళ్ల గురించి ఒకరు తిట్లు, వివరణలు, సవరణలు లాంటి వాటితో రోజుకో పేజీ నింపేస్తూ పాఠకులకు కావల్సినంత వినోదం అందజేస్తున్నాయి. మరే రాష్ట్రంలోనన్నా ఇలాంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు. వీళ్ల గొడవలో పార్టీల రాజకీయాలు వెనక్కెళ్లిపోయాయి. వార్తా పత్రికలు ఏదో ఒక పార్టీకి కొమ్ముకాయటం పాత పద్ధతి. ఇప్పుడు పార్టీలే పత్రికల తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నాయి.

సాక్షి కాంగ్రెస్ కి కరపత్రం, వాళ్ల రాతలు పట్టించుకోనవసరం లేదు అని చంద్రబాబు ఉద్దేశం. కావచ్చు. ఈనాడు గుంభనంగా తెదేపాని వెనకేసుకొస్తే, కాంగ్రెస్ విషయంలో సాక్షి అదే పని బహిరంగంగా మరింత బరితెగింపుతో చేస్తుంది. జగన్మోహన రెడ్డి ఎంత కాదన్నా ఈ విషయంలో పాఠకులకి ఎలాంటి అనుమానమూ లేదు. సాక్షి ఎందుకు పుట్టిందో తెలియనోళ్లెంతమంది? అయినా, ఆయన పత్రిక ఆయనిష్టం. ఎవరికి అనుకూలంగానన్నా రాసుకుంటాడు. వద్దనటానికి మనమెవరం?

అయితే జగన్మోహనుడు మర్చిపోతున్న విషయమొకటుంది. పార్టీల విషయంలో ఈనాడు విధేయతలెలా ఉన్నా, వార్తా సేకరణ, ప్రచురణల విషయంలో వాళ్లకున్న నిబద్ధతే పాఠకలోకం ఆ పత్రికకు పట్టం కట్టేలా చేసింది. పిచ్చి రాతలు రాసే పత్రికలని నెత్తినెత్తుకోవటానికి జనాలేమీ వెర్రిబాగులోళ్లు కారు. సాక్షి వచ్చీ రావటమే కాంగ్రెస్ కరపత్రంగా ముద్రవేయించుకోవటంపై కాకుండా పత్రిక నాణ్యతా ప్రమాణాలపై దృష్టి పెట్టి ఉంటే రెండు రూపాయకే ఇవ్వటం, అన్నీ రంగుల్లో ముద్రించటం లాంటి తాయిలాల అవసరం ఉండేది కాదు.

విడ్డూరమేమిటంటే, రాష్ట్రంలో ఎండలతో పోటీపడుతూ అన్ని సరుకుల ధరలూ మండిపోతుంటే ఆ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యాసాలు ప్రచురించటంపోయి అన్ని దిన పత్రికలూ తమలాగే రెండు రాపాయలకే ఇవ్వాలని సాక్షి దిన పత్రిక ఉద్యమం మొదలెట్టటం! ఇప్పటికే 'రెండు రూపాయలకే కిలో పేపరు' గా ముద్రపడిపోయింది సాక్షికి. ఇలాంటి ఉద్యమాలతో జనాలకి ఒరిగేదేమిటి? ఎవరికే ధర గిట్టుబాటవుతుందో ఆ ధరకి అమ్ముకుంటారు. పాఠకులు కూడా తమకేది ఇష్టమయితే అది కొని చదువుతారు. అయినా జగన్ అమాయకత్వం కాకపోతే, సాక్షి వల్ల ఈనాడు కోల్పోయిన సర్క్యులేషన్ పదిశాతం కూడా లేదని వార్తలొస్తున్న నేపధ్యంలో, 'ఆ రెండు పత్రికలు' కూడా జగన్ కోరినట్లు రెండు రూపాయలకే ఇవ్వటం మొదలెడితే ఇక సాక్షిని ఎవరు కొంటారు? అప్పుడు ఉచిత విద్యుత్తు లాగా ఉచిత పేపరు పధకం ఏమన్నా మొదలెడతారా?

Thursday, May 1, 2008

ఇండియన్ రికార్డ్ డాన్సింగ్ లీగ్

ఐపిఎల్ కి ప్రత్యేక ఆకర్షణకోసం విదేశాలనుండి ఛీర్ లీడర్స్ ని తెప్పించారట. వీళ్లు లేకుండా క్రికెట్ మనలేదా? అసలు, షాహిద్ ఆఫ్రిది అన్నట్లు, జనాలకు క్రికెట్ కన్నా ఎక్కువ వినోదం ఛీర్ లీడర్స్ ఏమివ్వగలరు?

1990లలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక దేశం ఎందులో పురోగమించినా లేకున్నా ఇలాంటి విషయాల్లో మాత్రం తెగ దూసుకుపోతుంది. గ్లోబలైజేషన్ పేరుచెప్పి ఒక పద్ధతి ప్రకారం జనాల్లో వినిమయ మనస్తత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఒకవంక కడుపునింపుకోటానికి కోటప్పకొండ తిరునాళ్లలోనో మరోచోటో రహస్యంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట గంతులేసేవాళ్లనీ, వేయించేవాళ్లనీ అశ్లీల నృత్యాలపేరుతో అరెస్టు చేయిస్తారు; మరోవంక బడా వ్యాపారవేత్తల అండతో ఛీర్ లీడింగ్ పేరుతో బహిరంగంగా జరిగే ఈ తంతు మాత్రం వినోదం ప్రోత్సహిస్తారు. వ్యాపారం పేరుతో ఏం చేసినా చెల్లిపోతుంది! రెండు మూడేళ్ల పాటు విదేశీ భామలను అద్దెకు తెచ్చి ఇలా ఆడిస్తారు; ఆ తర్వాత మెల్లిగా మన అమ్మాయిలనే ఇందులోకి దించుతారు. పదేళ్లు గడిచేలోగా ఛీర్ లీడింగ్ పేరుతో బట్టలిప్పి గంతులేయటాన్ని ఓ అద్భుతమయిన ఉపాధి అవకాశంగా భారతీయ టీనేజర్ల మనసుల్లో నాటుతారు. ఎవరాపుతారు దీన్ని?

ఇకపోతే, ఛీర్ లీడర్స్ బాధల గురించి వార్తాపత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వస్తున్న వ్యాసాలు, వాళ్ల మీద సానుభూతి మాటలు హాస్యాస్పదం. రెచ్చగొట్టేలా అర్ధనగ్న నాట్యాలు చేస్తే ఎవరైనా పిచ్చి వేషాలే వేస్తారు. జనాల బలహీతలను సొమ్ము చేసుకునే వృత్తిలో ఉండి అదో గౌరవప్రదమయిన ఉద్యోగమని చెప్పుకోవటం సిగ్గుచేటు. వంటినిండా బట్టలతో నాట్యం చేసే కళాకారిణులను ఎవడూ ఏడిపించటంలేదే? (అలాంటోళ్లు అసలు ఉండరని కాదు) ఇల్లు బార్లా తెరిచిపెట్టి ఊరెళ్లొచ్చి, ఆనక దొంగలు పడి మొత్తం ఊడ్చుకుపోయారని ఏడిస్తే ఉపయోగమేంటి?

కొసమెరుపు: ఈ మధ్య భాగ్యనగరంలో బీచ్ వాలీబాల్ పోటీలు జరిగాయట. ఆటగత్తెలు అతి కురచ దుస్తులు మాత్రమే వేసుకుని ఆడాలనే నిబంధన వల్ల చూడటానికి జనాలు ఎగబడి వచ్చారట. ఏదైతేనేం, టొర్నమెంట్ బ్రహ్మాడంగా విజయవంతమయింది. కాకపోతే ఎవరికీ రాని అనుమానమోటుంది. హైదరాబాద్ లో బీచ్ ఎక్కడినుండి వచ్చింది?

ప్రాచీన హోదాతో ఒరిగేదేంటి?

పార్లమెంటులో తెలుగుకు ప్రాచీనా హోదా గురించిన ప్రశ్న అడిగి సమాధానం వినే సమయమొచ్చినప్పుడు పత్తాలేకుండా పోయిన సభ్యురాలి గురించి చదివినప్పుడు నవ్వొచ్చింది. మనకేదో చేసేస్తున్నట్లు కనపడటమంటే ఎంత తపనో వీళ్లకి!

ఏ ఉద్దేశ్యంతో అన్నాడోగానీ, 'మనవాళ్లుత్త వెధవాయలోయ్' అని గిరీశం మహాశయుడన్నది మనవాళ్ల భాషాభిమానం విషయంలో మాత్రం పచ్చి నిజం. అరవ వాళ్లని చూసి మా భాషకి కూడా ప్రాచీన హోదా ఇవ్వమని కేంద్రాన్ని దేబిరించే బదులు రాష్ట్రం లోని అన్ని బళ్లలోనూ (అంటే .. ప్రభుత్వ, ప్రైవేటు, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ .. అన్ని రకాల బడులు) పదో తరగతి దాకా తెలుగు బోధన తప్పని సరి చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డేంటి? అసలు, ఎవరో ప్రాచీన హోదా ఇస్తే మన భాషకొరిగేదేంటి? అయితే గియితే, ఆ పేరుతో కొన్ని కోట్ల రూపాయల నిధులు వస్తాయి - అవీ ఏ రాజకీయుడి బంధుగణానికో సంతర్పణమే. కేంద్రాన్ని అడుక్కునే పని లేకుండా తెలుగుని నిజంగా ఉద్ధరించే మార్గాలు సవాలక్ష ఉండగా అవన్నీ పక్కనబెట్టి ప్రాచీన హోదా గురించి ఈ రచ్చ ఎందుకు? రాష్ట్రంలో తెలుగు మిణుకు మిణుకు మంటుంటే పట్టించుకోకుండా పరాయివాళ్లు మన వెలుగులు గుర్తించటంలేదని ఏడవటమేంటి?

ప్రభుత్వం సంగతి పక్కనబెడితే, ప్రైవేటు మీడియాలో తెలుగు ఎంత శుద్ధంగా అమలవుతుంది? ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఒకట్రెండు తప్ప మిగతా దినపత్రికల్లోగానీ, వార పత్రికల్లోగానీ రాసే తెలుగులో తెలుగెంత? టి.వి. ఛానళ్లు మరీ ఘోరం. యాంకరమ్మలు వంకర మాటలతో ఇటు తెలుగుని, అటు ఇంగ్లీషుని రెంటినీ నరికి పాతరేస్తున్నా ఆయా కార్యక్రమాల దర్శక నిర్మాతలు కిమ్మనరెందుకో! సినిమాల విషయం ఇక చెప్పక్కరలేదు. మొన్నటి దాకా హిందీ నాసికా గాయకాగ్రేసరుల ధాటికి ముక్కలు చెక్కలయిన పాటలనే విని తరించే వాళ్లం. ఇప్పుడు కొత్తగా డబ్బింగ్ రంగంలోకి కూడా పంజాబీ భామలు ప్రవేశించి చంపేస్తున్నారు! మరో వంక తమిళ దర్శకుల సమూహం 'పెద్ద పుడింగువా', 'పోడా మచ్చీ' లాంటి పదాలను విరివిగా తెలుగులోకి చొప్పించేసి మన భాషని సుసంపన్నం చేసేస్తుంది.

తెలుగుకి సంబంధించి ఇలాంటి చిన్నా పెద్దా సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. వేరే వాళ్లు మనభాషని గుర్తించటలేదని బాధపడటం ఆపి ముందు తెలుగు వాళ్లు తెలుగుపై అభిమానం పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెయ్యటం మంచిది.

ఏకగ్గీవం

అనగనగనగనగనగనగా ఆ కాలంలో రాజుగారుబోతే ఆయన కొడుక్కో, జామాతకో రాజ్యమప్పజెప్పటం ఓ పద్ధతిగా ఉండేది. అరవయ్యేళ్ల కితం గాంధీగారు తెల్లోడి కాణ్నించి సొతంత్రం లాక్కొచ్చి ఇప్పించి 'పెజలారా, ఇయాల్టి నుండి రాజ్యాలు గీజ్యాలు బోయినయ్యి. ఇగనుండి మీరే ఈ దేశాన్నేలే రాజులు, ఇగనుండీ యాడ జూసినా పెజాసామ్మమే' అన్నారు. కామోసుననుకున్నాం. ఇదేదో బానే ఉందిలే అనిగూడా అనుకున్నాం.

మరిప్పుడేంది. ఈ కాంగిరేసోళ్లు, తెలుగుదేసపోళ్లు ఎవురన్నా ఎమ్మేల్లేలుబోతే ఆళ్ల కొడుకులకి, పెళ్లాలకీ ఎలచ్చను లేకుండా ఆ పదవిచ్చెయ్యాలని అంటాండారు? రాజ్యాలు గీజ్యాలు బోయినయ్యని గాంధీగారు జెప్పిందంతా ఉత్తుత్తిదేనా? పైగా దీనికేదో పేరుగూడా బెట్టిండ్రు - ఏకగ్గీవమంట. అవతలోళ్ల మీద సానుబూతితో ఆళ్ల సీటు ఆళ్లింటోళ్లకే ఇచ్చెయ్యాలంట.

పైనేడుండో గానీ మారాజు ఎన్టీవోడు మాబోటి జనాలకి రాజకీయం బలే నేర్పిబోయిండు. లేకపోతే ఈళ్లు జెప్పేదంతా నిజమేనని నమ్మేటోళ్లమే. అవతలోళ్ల మీద సానుబూతా పాడా. కైరాతాబాదులో తెలుగుదేసం, తెర్లాంలో కాంగిరేసు ఓడిపోయితీరతారని ఈళ్లకి తెగ నమ్మకం. అందుకే ఈ ఏకగ్గీవం అవిడియా. ఇయన్నీ జూస్తంటే నాకో బెమ్మాండమైన సేవింగ్సు అవిడియా వచ్చింది. వచ్చే జెన్రల్ ఎలచ్చన్ల నాటికి సెంద్రబాబు, రాజ్సేకర్రెడ్డి ఓ తాన కూకొని ఏడేడ వాళ్ల పార్టీలోళ్లు ఓడిపోతారో ముందే ఓ లిస్టేసుకుని ఆడాడ ఏకగ్గీవాలకొప్పుకుంటే బోలా? మిగతా సోట్ల మాత్రమే ఎలచ్చనుబెడితే బోల్డంత సోమ్మాదా గాదా ఏంది? తాప తాపకి ఎలచ్చన్లుబెట్టి ఊకినే జనాల సొమ్ము దుబారా సెయ్యటమెండుకంటా? అహ, నాకు తెలీకడుకుతాండ. సదువుకున్నోడివిగందా. నువ్వు జెప్పు.