Thursday, May 22, 2008

ఇందిరా ప్రదేశ్!

ఐదేళ్లుగా స్వదేశమెళ్లకుండా అమెరికాలోనే దాక్కున్న నా హైదరాబాదీ మితృడిని కారణమేంటని ఆరా తీస్తే ‘హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగ్గానే నా పేరుని రాజీవ్ గా మార్చేస్తారేమోనని భయంగా ఉందిరా. అందుకే ..’ అన్నాడు దిగులుగా. వాడి అసలు పేరు అంత గొప్పగా ఏమీ ఉండదు, కానీ ఎవరి పేరుపై వాళ్లకి మమకారమే కదా. అసలు విషయానికొస్తే ..
‘ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా’ అని పార్లమెంటులో ఎలుగెత్తి చాటిన పాతతరం కాంగిరేసు కేతిగాళ్ల గురించి కేవలం వినున్నాం. ఇప్పుడు వాళ్ల తలదన్నే భజన సామ్రాట్టులని మన రాష్ట్రంలోనే ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రకటించిన పధకాలు ఎంత నత్తనడకలు నడుస్తున్నా, ప్రతిదానికీ రాజీవుడిదో లేక ఇందిరమ్మదో పేరు తగిలించే కార్యక్రమం మాత్రం శరవేగంగా అమలవుతోంది. తాము అధికారంలోకొస్తే ఇలా అన్నిటికీ వాళ్లిద్దరి పేర్లు తగిలిస్తామని పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ వాగ్దానమేమన్నా చేశాడేమో మరి. ఒక లెక్క ప్రకారం ఇప్పటికే దాదాపు పాతిక ప్రభుత్వ పధకాలకు, నిర్మాణాలకు ఈ రెండు పేర్లు తగిలించేశారు. కె.పి.హెచ్.బి. కి కూడా ఆ పని చెయ్యబోతే అక్కడి జనాలడ్డుపడటంతో ఎలాగో ఆగిపోయింది. ఉప్పల్ లో హెచ్.సి.ఎ. వాళ్లు కోట్లు పోసి కట్టించుకున్న క్రికెట్ స్టేడియానిక్కూడా రాజీవ్ పేరు తగిలించాలని ముఖ్యమంత్రి ముచ్చటపడితే స్టేడియం నిర్మాణానికయిన ఖర్చు స్పాన్సర్ చేసిన సంస్థ ఒప్పుకోలేదు. అప్పుడు ఆ ఖర్చు (5 కోట్లట) ప్రభుత్వ పద్దులోంచి విశాకా అనబడే సదరు సంస్థకి రాసిచ్చి మొత్తమ్మీద ముఖ్యమంత్రిగారి ముద్దు తీర్చారు సర్కారువారు - ఇది రెండేళ్ల క్రితం సంగతి. సోనియామ్మ దయాదాక్షిణ్యాలకోసం ఐదు కోట్ల రూపాయల జనం సొమ్ము తగలేసి ఒక క్రీడాంగణానికి రాజీవుడి పేరు కొని పెట్టారన్నమాట!
ఈ క్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిణి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి అసలు రాష్ట్రం పేరే ఇందిరమ్మ రాష్త్రంగా మారిస్తే పోతుందన్న మహత్తరమైన ఆలోచనొచ్చింది. పధకానికోసారి పేరు పెట్టటం, ఉన్న వాటికి పేర్లు మార్చటం వృధా ప్రయాస అనుకున్నారేమో మరి, ఏకంగా టోకున రాష్ట్రానికే పేరుమార్చేస్తే బావుంటుందనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం, నిన్న గుంటూరులో ఆ సంగతి కడు తన్మయం చెందుతూ ప్రకటించేశారు. పైగా, ‘ప్రజలు కోరితే చేస్తాం’ అంటూ ఈ బృహత్పధకంలో అడగకున్నా ప్రజలకూ భాగస్వామ్యం కల్పించారు మంత్రివర్యులు. ఆ మాటలో ’మేం చేస్తే మీరు కోరినట్లే’ అన్న నిగూఢార్ధమేమన్నా దాగుందేమో తెలీదు. దీని తర్వాత రాష్ట్రంలో మగవాళ్లందరి పేరు ముందరా ‘రాజీవ్’, ఆడవాళ్లందరి పేరు ముందరా ‘ఇందిర’ అని తప్పనిసరిగా చేర్చాలని శాసనం కూడా చేస్తారు కాబోలు.
అసలు, అంత స్వామి భక్తి పరాయణులైతే తమ పిల్లలకో మనవలకో ఇందిరా రాజీవుల పేర్లు పెట్టుకుని తరించొచ్చుగదా. రాజశేఖరరెడ్డి గారిని రాజీవ్ శేఖర రెడ్డిగా మారిపొమ్మనండి. ఎవరొద్దంటారు? వాళ్ల ఇష్టాయిష్టాలను రాష్ట్రం నెత్తిన రుద్దటమేంటి? ప్రతిదానికీ కాంగ్రెస్ నేతల పేర్లే పెట్టదలచుకుంటే పి.వి., జలగం, కాసు, కోట్ల, చెన్నా లాంటి ఎందరు నాయకులు లేరు? మరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనూ చూడమీ చోద్యం. జనాలకు విసుగొచ్చేదాకా ఈ భజన వ్యవహారాలు సాగదీస్తే ఏలినవారికెప్పుడో ఎదురుదెబ్బ తగలడం ఖాయం.

No comments: