తెరాస ఆవిర్భావం సందర్భంగా కెసియార్ కూలిపని చేసి రెండు రోజుల్లో పద్దెనిమిది లక్షల రూపాయలు సంపాదించాడట! అక్కడ కూలీలే రోజుకు లక్షలు కళ్లజూస్తుంటే, ఎవడండీ తెలంగాణ వెనకబడిందని చెప్పింది? వచ్చే నెలాఖరు ఉప ఎన్నికల్లో కెసియార్ చెయ్యబోయే వాగ్దానాలు మచ్చుకు కొన్ని:
1. తెలంగాణ రాష్ట్రమొచ్చాక ఇంటికో కూలీ ఉద్యోగం గ్యారంటీ
2. కూలీ పనికవసరమైన స్కిల్ సెట్ లేనోళ్లకి ముష్టి పని గ్యారంటీ (దీనికి అధమం రోజుకో పదివేలన్నా రావా?)
ఏతావాతా, తెలంగాణా వాళ్లకి కెసియార్ ఇవ్వబోయేది ప్రతి చేతికీ ఓ చిప్ప. తెలంగాణ పేరు చెప్పుకుని నాలుగేళ్లుగా ఎంత సంపాదించాడు ఈయన? ఎన్నెన్ని డెడ్ లైన్లు పెట్టాడు? రాష్ట్రాన్ని చీల్చటం అంత తేలిక్కాదని తెలియదా? రేపే తెలంగాణా తెచ్చిమ్మని ఎవరైనా అడిగారా ఈయన్ని? ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అని రోజుకో తేదీ చెప్పటం, తీరా ఆ రోజొచ్చాక మొహం చాటెయ్యటం. ఇంకా ఎవర్ని మోసం చెయ్యటానికీ నాటకాలు? వీళ్లక్కావలసింది ప్రత్యేక తెలంగాణో, మరోటో కాదు. ఆ పేరుతో పబ్బం గడుపుకోవటం. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నారైలనుండీ, వేరేవాళ్లనుండీ వస్తున్న డబ్బంతా ఏమైపోతుంది? ఆ లెక్కలన్నీ ఎవరడుగుతారు, ఎవరు చెబుతారు? ఐదేళ్లకోసం ఎన్నిక చేసి చట్ట సభలకి పంపిస్తే వీళ్లు చేసింది మూడొచ్చినప్పుడల్లా రాజీనామా చెయ్యటం తప్ప మరేదీ లేదు. మళ్లీ మళ్లీ ఎన్నికలంటే, ఆ ఖర్చంతా ఎవడబ్బ సొమ్ము? అసలు, రాజీనామచేసి మళ్లీ ఎన్నికయ్యి ఈయన నిరూపించేదేమిటి?
ప్రత్యేక రాష్ట్రం కోసం రెచ్చగొడుతున్న వాళ్లని తెలంగాణ ప్రజలు ఓ ప్రశ్న అడగాలి. 'జనాల్లో సెంటిమెంటుంది', 'మా రాష్ట్రం మాకిచ్చేస్తే మా బతుకేదో మేం బతుకుతాం', 'ఇచ్చుడో చచ్చుడో', 'పంచుడో దంచుడో' లాంటి ఎమోషనల్ డైలాగులు వినటానికి బాగానే ఉంటాయి కానీ అసలు తెలంగాణా అంటూ ఏర్పడితే బండెలా లాగిస్తారో ఈ నేతలెన్నడన్నా చెప్పారా? చెప్పరు. ఎందుకంటే, ఆ విషయంలో వాళ్ల లెక్కలు వాళ్లకున్నాయి. ఊళ్లెలా పంచుకోబోతున్నారో దొంగలెన్నడన్నా బయటకు చెబుతారా? నలభై రెండుమంది ఎంపీలుండి, అందులో ముప్పైమంది అధికారపక్షం వాళ్లయితేనే మనకి కేంద్రంలో ముష్టి పడేసే దిక్కులేదు. ఇక రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విడగొట్టి, ముక్కకో పదిమంది ఎంపీలని పడేస్తే ఎంత కమ్మగా ఉంటుందో ఊహించుకోవచ్చు. భారతీయులందరం ఒక్కటే అన్న భావన పెంచాల్సిన నేతలే కుల, మత, వర్గ, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విభజన రేఖలు గీయటం దారుణం. అయినా, ఒక వంక ఎందరో తెలంగాణ సోదరులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆయా దేశస్థుల పొట్టలు కొడుతూ, ఆంధ్రలో పుట్టి పెరిగి హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం వచ్చినవాళ్లమీద కడుపుమంట చూపించటమేమిటి? అందునా, హైదరాబాద్ లో ఉండే ఉత్తర భారతీయుల మీద, ఇతర భాషల వారి మీద లేని ద్వేషం తెలుగు మాట్లాడే తోటి ప్రాంతాల వారిపై ఎందుకు? తెలంగాణని దోచేస్తుంది మరెవరో కాదు - అక్కడి నాయకులే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చేయాల్సింది ఇంటిదొంగలకు దేహశుద్ధి చెయ్యటం.
Friday, April 18, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment